దుమ్ము రేపిన ఇంగ్లండ్ ..దంచికొట్టిన మోర్గాన్

దుమ్ము రేపిన ఇంగ్లండ్ ..దంచికొట్టిన మోర్గాన్ ప్ర‌పంచ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ఇంగ్లండ్ దూకుడుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మైదానంలోకి వ‌చ్చారంటే చాలు క్రికెట‌ర్లు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల భ‌ర‌తం ప‌డుతున్నారు. ఎలాంటి బంతినైనా అవ‌లీల‌గా బౌండ‌రీ లైన్‌ను దాటించేస్తున్నారు. ఇంకే ముంది ప‌సికూన‌లైన ఆఫ్గ‌నిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ ఆడింది. భారీ స్కోర్ల‌ను సాధిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త క‌లిగిన టీంగా ఈ జ‌ట్టు పేరు తెచ్చుకుంది.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ..ఈ టోర్నీలో బంగ్లా విండీస్‌కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తే..తాజాగా ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఉతుకుడు స్టార్ట్ చేశాడు. అంద‌రూ సిక్స‌ర్లు కొట్టేందుకు నానా తంటాలు ప‌డుతుంటే మ‌నోడు బంతుల్ని పెవీలియ‌న్‌ను దాటించేస్తున్నాడు. ఇదే ఇత‌గాడి స్పెషాలిటీ.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 17 సిక్స‌ర్ల మోత మోగించాడు మోర్గాన్. ఏకంగా ప్ర‌పంచ రికార్డు న‌మోదు చేశాడు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌ను ఉతికేశాడు. క‌ల‌లో సైతం క‌ల‌వ‌రించేలా చేశాడు. ఇక బౌలింగ్ చేయాలంటేనే భ‌య‌ప‌డేలా దంచి కొట్టాడు. కేవ‌లం 71 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 148 ప‌రుగులు చేసిన మోర్గాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

టోర్నీలో భాగంగా మాంచెస్ట‌ర్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ ఆద్యంత‌మూ ఫ్యాన్స్‌కు పండుగ చేసుకునేలా ఆడారు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు. ఆతిథ్య జ‌ట్టు ప‌రుగుల సునామీ సృష్టించింది. భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్న ఈ జ‌ట్టు కెప్టెన్ ..దంచ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. కేవ‌లం 57 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న మోర్గాన్ అద్భుత‌మైన సెంచ‌రీ సాధించాడు. స్కోర్‌ను త‌న సిక్స‌ర్ల‌తో మోత మోగించాడు. ర‌షీద్ ఖాన్ 9 ఓవ‌ర్ల‌లో 110 ప‌రుగులు ఇచ్చాడు.

ఒక ఇన్నింగ్స్‌లో ఓ ఆట‌గాడు బాదిన అత్య‌ధిక సిక్స‌ర్లు మోర్గాన్ వే కావ‌డం గ‌మ‌నార్హం. 150 ప‌రుగుల తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఓడించింది ఇంగ్లండ్ జ‌ట్టు. జోరుమీదున్న ఈ జ‌ట్టు ఈ విజ‌యంతో సెమీ ఫైన్‌లోకి ప్ర‌వేశించింది.

71 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 17 సిక్స‌ర్ల సాయంతో 148 చేస్తే..బెయిర్ ఫ్లో 99 బంతుల్లో 90 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 3 భారీ సిక్స‌ర్లున్నాయి. మ‌రో ఇంగ్లండ్ ఆట‌గాడు రూట్ 82 బంతులు ఎదుర్కొన్ని 88 ప‌రుగులు సాధించాడు.

వీరంద‌రి విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ దెబ్బ‌కు 6 వికెట్లు కోల్పోయి 397 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది ఇంగ్లండ్. టార్గెట్ ఛేద‌న‌లో ఆఫ్ఘాన్ చ‌తికిల‌ప‌డింది. హ‌స్మ‌తుల్లా 76, రిహ్మ‌త్ షా 46, ఆస్ఘ‌ర్ 44 ప‌రుగులు చేసి రాణించినా జ‌ట్టును గ‌ట్టెక్కించ‌లేక పోయారు.